Photobucket

RAM ఎలా పనిచేస్తుంది

Posted by Spurthi | | Category: |



మెమరీ అంత ఎక్కువగా ఉంటే అప్లికేషన్ ప్రోగ్రాములు అంత వేగంగా పనిచేస్తాయని మనకు తెలుసు. అయితే RAM ఎలా పనిచేస్తుంది. దాని పనితీరుని పెంపొందించడానికి మనం స్వతహాగా చేయవలసిన సెట్టింగుల గురించి అవగాహన లేనివారికి ఈ వ్యాసం ఉపయుక్తంగా ఉంటుంది.

ఎలా పనిచేస్తుందంటే ..

ప్రతీ మెమరీ మాడ్యూల్‌పై పలు చిప్‌లు అమర్చబడి ఉండడం గమనించే ఉంటారు. ఆయా చిప్‌లలొ ప్రతీ చిప్‌పై సూక్ష్మమైన కెపాసిటర్లు అనేకం ఒక సముదాయంగా పొందుపరచబడి ఉంటాయి. వీటిలో ప్రతీ కెపాసిటర్ కొంత విద్యుత్‌ని స్వీకరించగలుగుతంది. ఇలా ఏదైనా కెపాసిటర్ విద్యుత్ స్వీకరించినట్లయితే అప్పుడు బైనరీ విలువ 1ని ఆ కెపాసిటర్ కలిగి ఉన్నట్లు భావించాలి. కెపాసిటర్ విద్యుత్‌ని తీసుకోకపోతే బైనరీ విలువ 0కలిగి ఉన్నట్లు పరిగణించాలి. మన ఫైళ్ళు మొత్తం ఇలా 0, 1, లతో కూడిన బైనరీ డేటాగానే స్టోర్ చెయ్యబడుతుందని మీకు తెలిసిందే! మెమరీలో డేటాని స్టోర్ చెయ్యడానికి తిరిగి దానిని చదవడానికి పిసి ఇదే పద్ధతిని అనుసరిస్తుంది. ఒక్కోసారి కాస్మిక్ కిరణాల ప్రభావం వల్ల మెమరీ చిప్‌లోని కెపాసిటర్లు తాము నిల్వ ఉంచుకున్న విద్యుత్‌ని కోల్పోతుంటాయి. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిని సరిచేసి డేటాకి నష్టం వాటిల్లకుండా చేయడానికి ECC (Error Correction Code) అనే టెక్నాలజీని RAMలో వాడుతుంటారు.

నిలువు , అడ్డ వరుసలు

మన పిసి మెమరీ నుండి ఎదైనా అంశాన్ని రీడ్ చెయ్యాలని కోరుకున్నప్పుడు RAM కంట్రోలర్ సర్క్యూటరీ అ అంశం RAM లోని ఏ చిప్‌లో, ఏ అడ్డ వరుస, నిలువు వరుసలోని కెపాసిటర్‌లో స్టోర్ చేయబడి ఉందన్నది Row Address Strobe (RAS), Column Address Strobe(CAS), అనే పిన్‌ల ఆధారంగా పిసికి తెలియజేస్తుంది. ఈ పద్ధతి వల్ల రామ్ కంట్రోలర్ సర్క్యూటరీపై పెద్దగా భారం పడకుండా వీలైనంత వేగంగా మెమరీ నుండి డేటా యాక్సెస్ చేయబడుతుంది.